Liquor policy: ఢిల్లీ మద్యం పాలసీతో రూ.2,026 కోట్ల నష్టం.. కాగ్ నివేదికలో వెల్లడి !
అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం పాలసీ (Liquor policy) వ్యవహారంపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రద్దైన లిక్కర్ పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2026 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసుపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదిక లీకైనట్టు పలు కథనాలు వెల్లడించాయి. అంతేగాక మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని, లైసెన్స్‌ల జారీలోనూ లోపాలున్నాయని నివేదిక పేర్కొన్నట్టు తెలిపాయి. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు లంచాల ద్వారా లబ్ధి పొందారని నివేదిక ఆరోపించినట్టు సమాచారం. నిపుణుల కమిటీ సూచించిన సిఫార్సులనూ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం తిరస్కరించినట్లు పేర్కొంది.
కేబినెట్ ఈ విధానాన్ని ఆమోదించిందని అయితే అనేక కీలక నిర్ణయాలపై అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకోలేదు. అందుకే మద్యం పాలసీ తన నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందని నివేదికలో పేర్కొంది. ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలూ వేలం వేయడానికి అనుమతించాయని, పాలసీ ముగియక ముందే పలువురు రిటైలర్లు తమ లైసెన్సులను సరెండ్ చేశారని, కానీ వారిని ప్రభుత్వం రీటెండర్ ఇవ్వలేదని తెలిపింది. దీని వల్ల రూ.890 కోట్ల నష్టం వాటిల్లిందని, అలాగే కొంత మంది లైసెన్స్ దారులకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడా రూ.941 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడించింది. అంతేగాక కొవిడ్ టైంలో ప్రభుత్వం రూ.144 కోట్ల లైసెన్స్ ఫీజులను మాఫీ చేసిందని దీంతో ప్రభుత్వ ఆధాయానికి భారీగా నష్టం వాటిల్లినట్టు నివేదిక పేర్కొంది.
కాగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. అనంతరం ఈ విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆప్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేపట్టాయి. ఈ స్కామ్‌లో మాజీ సీఎం కేజ్రీవాల్, పలువురు ఆప్ నేతలు జైలుకు సైతం వెళ్లారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికళ వేల కాగ్ రిపోర్టు లీకవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
నివేదిక బీజేపీ ఆఫీసులో దాఖలైందా?: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
కాగ్ నివేదిక లీక్ అవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay singh) స్పందించారు. ‘కాగ్ రిపోర్టు ఎక్కడ ఉంది? ఈ వాదనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. బీజేపీ కార్యాలయంలో నివేదిక దాఖలైందా?’ అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మానసిక సమతుల్యం కోల్పోయారని విమర్శించారు. కాగ్ నివేదిక ఢిల్లీ అసెంబ్లీలో అందజేయాల్సి ఉందని తెలిపారు. నివేదిక అందజేయక ముందే ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.