ఆ ముగ్గురు లేకుంటే తీవ్ర సంక్షోభంలో ఉండేవాళ్లం.. నిర్మలా సీతారామన్‌పై లంక అధ్యక్షుడి ప్రశంసలు
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే తమ దేశాన్ని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోకుండా సహాయపడిన ముగ్గురు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే తమ దేశాన్ని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోకుండా సహాయపడిన ముగ్గురు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరిలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. ఆమెతో పాటు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జియోర్గివా లేకుండా తమ దేశం మరింత కష్టాల్లో ఉండేదని అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత ఏడాది నుంచి ఈ ఏడాదిలో దేశంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. అందులో ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ క్షీణత.. దీనిని అధిగమించడంలో ముగ్గురు మహిళల పాత్ర మరువలేనిదని చెప్పారు. సంక్షోభంలో ఉన్న తమకు భారత్ గొప్ప సహాయాన్ని చేసిందని తెలిపారు.