PM Modi: కుంభమేళా సక్సెస్.. సబ్ కా ప్రయాస్ కి గొప్ప ఉదాహరణ- మోడీ
మహాకుంభమేళా (Maha Kumbh) విజయం సబ్ కా ప్రయాస్(అందరి కృషికి) గొప్ప ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహాకుంభమేళా (Maha Kumbh) విజయం సబ్ కా ప్రయాస్(అందరి కృషికి) గొప్ప ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం గొప్పతనాన్ని చూసిందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం మోడీ లోక్ సభలో ప్రసంగించారు. రైజింగ్ ఇండియా స్ఫూర్తి మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని చెప్పుకొచ్చారు. మహా కుంభమేళా విజయంలో చాలా మంది ముఖ్యపాత్ర పోషించారన్నారు. ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచమంతా సవాళ్లతో కూడిన సమయం ఉందని.. ఇలాంటి సమయంలో కుంభమేళా ద్వారా ఈ ఐక్యతను ప్రదర్శించామన్నారు. అదే మన గొప్ప బలమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశ ప్రత్యేకత అని ఎప్పుడూ చెబుతూనే.. దాన్ని మరోసారి రుజువు చేశాం. ప్రయాగ్ రాజ్ లో దాన్నే చూశామని చెప్పుకొచ్చారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్
మోడీ మాట్లాడుతూ.. ‘‘ఎర్రకోట నుండి సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ ప్రాముఖ్యతను ప్రస్తావించాను. గతేడాది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రారణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా సంబురాలు చేసుకుంది చూశాం. కుంభమేళాలోను అలాంటి ఐక్యతే కనిపించింది. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిసామర్థ్యాలను ఈ రూపంలో చూసింది. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్తతరం గౌరవంతో స్వీకరిస్తోంది’’ అని మోడీ మాట్లాడారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. దాంతో సభ వాయిదా పడింది. ఇదిలాఉంటే.. ప్రతీ 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. కోట్లాదిమంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.