Kolkata doctor Murder: సాక్ష్యాలు ధ్వంసం చేశారు.. పోలీసులపై బాధితురాలి పేరెంట్స్ ఫైర్

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు(Kolkata Doctor Rape and Murder) సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-09 04:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు(Kolkata Doctor Rape and Murder) సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేసేందుకు ముందునుంచే పోలీసులే ప్రయత్నించారని ఆరోపించారు. కోల్‌కతాలో ఆదివారం హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా భారీ నిరసన జరిగింది. ఈ ర్యాలీలో మృతురాలి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు మొదలైనప్పటి నుంచి బెంగాల్ ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, పోలీసులు (Kolkata Police) మాకు సహకరించడం లేదు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మాకు త్వరగా న్యాయం జరుగుతుందని భావించట్లేదు. కానీ న్యాయం అందేవరకు పోరాడుతూనే ఉంటాం. దేశ ప్రజలంతా మాకు అండగా ఉంటున్నారని విశ్మసిస్తా. అదే నమ్మకంతో మా పోరాటాన్ని సాగిస్తాం’’ అని అన్నారు.

గతంలోనూ ఆరోపణలు

ఇకపోతే, ఈ కేసులో కోల్‌కతా పోలీసుల తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె అంత్యక్రియలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు డబ్బుఆశ చూపించారని కూడా ఆరోపించారు. ఈ కేసుని బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, విచారణలో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో, కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది.


Similar News