BJP : ‘‘మొహబ్బత్ కీ దుకాణ్‌లో రేపిస్టులే ఉంటారా ?’’.. కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఇండియా కూటమి నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని బీజేపీ ప్రశ్నించింది.

Update: 2024-08-16 15:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఇండియా కూటమి నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని బీజేపీ ప్రశ్నించింది. దీన్నిబట్టి ఆ కూటమిలోని పార్టీల వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవచ్చని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పేర్కొన్నారు. శుక్రవారం ఆయన లక్నోలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇంత దారుణమైన కేసును సీబీఐకి బదిలీ చేసే నిర్ణయాన్ని తీసుకునేందుకు 70 సెకన్లు చాలు.. కానీ మమతా బెనర్జీ తన ఫ్రస్ట్రేషన్‌ను ప్రదర్శించేందుకు వారం రోజుల టైం తీసుకున్నారు’’ అని సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు.

గతంలో సందేశ్‌ఖాలీ హింసాకాండ, షాజహాన్ షేక్ కేసులలోనూ మమతా బెనర్జీ సర్కారు ఇలాగే మొండిగా వ్యవహరించిందన్నారు. ‘‘సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కనౌజ్ లోక్‌సభ స్థానం పరిధిలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బాధితులను కొందరు సమాజ్‌వాదీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. కోల్‌కతా ఘటనపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్‌లో ఇలాంటి రేపిస్టులు, అరాచక వాదులే ఉంటారేమో అని సుధాంశు త్రివేది కామెంట్ చేశారు. 

Tags:    

Similar News