Delhi Pollution: ఢిల్లీలోని 113 ప్రవేశ మార్గాల దగ్గర నిఘా ఉండాల్సిందే- సుప్రీంకోర్టు
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొంతకాలంగా తీవ్ర వాయుకాలుష్యం(Delhi Pollution) కొనసాగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొంతకాలంగా తీవ్ర వాయుకాలుష్యం(Delhi Pollution) కొనసాగుతోంది. నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద నిఘా తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. "113 మార్గాల్లో దాదాపు 100 ఎంట్రీ పాయింట్లు మానవరహితంగా ఉన్నాయి. ట్రక్కుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి ఎవరూ లేరు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు వెంటనే అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి" అని ఆదేశించింది. అలానే, జీఆర్‌ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. 13 ఎంట్రీ పాయింట్ల వద్ద రికార్డయిన సీసీటీవీ మెటీరియల్‌లను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటి పర్యవేక్షణను తనిఖీ చేయాలని బార్ సభ్యులను కోరింది. ఆ నివేదికను బట్టి గ్రాప్ 4 ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామంది.
వాయుకాలుష్యం
మరోవైపు, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)ను అమలు చేస్తోంది. ప్రస్తుతం, అక్కడ గ్రాప్ 4 (GRAP-4) అమల్లో ఉంది. దీనిలో భాగంగా ఢిల్లీలో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. 50 శాతం సిబ్బంది ఇంటి నుంచే పని చేయనున్నారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు.