కేరళ పద్మనాభస్వామి ఆలయంలో చోరీ కేసు.. నలుగురు అరెస్ట్

కేరళ పద్మనాభస్వామి ఆలయంలో స్వామివారి నైవేద్య పాత్రను దొంగిలించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-20 13:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రసిద్ధి చెందిన శ్రీపద్మనాభస్వామి ఆలయం (Kerala Padmanabha Swamy Temple)లో చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తుల్ని ఆదివారం హర్యానాలో అరెస్ట్ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. అక్కడ ఉరులి అని పిలిచే.. స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించే లోహపాత్రను నిందితులు అపహరించారని వార్తలొచ్చారు. ఆ పాత్రను స్వామివారి నైవేద్యానికి వినియోగించేవారని పోలీసులు చెప్పారు. హర్యానా పోలీసుల సహాయంతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుడు గణేష్ ఝా గా గుర్తించారు.. అతను మరో ముగ్గురు మహిళలతో కలిసి గతవారం ఆలయాన్ని సందర్శించాడని తెలిపారు. గురువారం (అక్టోబర్ 17) ఆలయం నుంచి పాత్రను మిస్సైనట్లు గుర్తించామన్నారు. కాగా.. విచారణలో గణేష్ ఝా.. ఉరులి (Uruli)ని తాము దొంగిలించలేదని చెప్పాడన్నారు. తాము ఒక ప్లేట్ లో పూజా సామాగ్రిని పెట్టుకుని ఆలయంలోకి వెళ్లగా.. పొరపాటున అవి కిందపడ్డాయని, వాటిని తీసేందుకు మరో వ్యక్తి సహాయం చేశాడని చెప్పారు. ఈ క్రమంలో ఉరులిని కూడా తమ ప్లేట్ లోనే పెట్టి ఇచ్చారని, ఆలయం నుంచి వెలుపలికి వచ్చేటపుడు తమనెవ్వరూ ఆపకపోవడంతో వెళ్లిపోయామని చెప్పాడన్నారు. గణేష్ ఝా ఇచ్చిన వివరణతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.

పటిష్ట బందోబస్త్ ఉండే ప్రసిద్ధ కేరళ పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి చోరీ జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో, ఆలయం చుట్టూ 200 మంది పోలీసులు, ఒక ఎస్పీ, ఒక డిప్యూటీ ఎస్పీ, 4 సర్కిల్ ఇన్ స్పెక్టర్లు కాపలాగా ఉన్నారు. ఆలయం నుంచి ఒక పాత్ర మిస్సవ్వడంలో సెక్యూరిటీ తప్పిదంగా భావిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


Similar News