బెడిసికొట్టిన కేజ్రీవాల్ వ్యూహం.. షాకిచ్చిన 7 రాష్ట్రాల సీఎంలు!
రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాల ఐక్యత కూటమిపై జరుగుతున్న ప్రయత్నాలు ఎటూ కొలిక్కి రావడం లేదు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాల ఐక్యత కూటమిపై జరుగుతున్న ప్రయత్నాలు ఎటూ కొలిక్కి రావడం లేదు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పలువురు సీఎంలు షాకిచ్చారు. ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (జీ8) పేరుతో కేజ్రీవాల్ ఏడుగురు సీఎంలను విందుకు ఆహ్వానించగా ఒక్కరి నుంచి కూడా రెస్పాన్స్ రాకపోవడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2024 లోక్ సభ ఎన్నికల వ్యూహం చర్చించేందుకు గాను తనతో సహా మొత్తం 8 మంది సీఎంలను కేజ్రీవాల్ ఆహ్వానించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో మార్చి 18న ఈ విందు జరగాల్సి ఉంది. ఈ భేటీకి రావాల్సిందిగా బీహార్, పశ్చిమబెంగాల్, తెలంగాణ సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కె.చంద్రశేఖర్ రావుతో సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేజ్రీవాల్ ఆహ్వాన లేఖలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వివిధ కారణాలతో ఎవరూ ఈ భేటీకి హాజరుకాకపోవడంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిందనే టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గత వారం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా పేరుతో కేజ్రీవాల్ చేస్తున్న విందు రాజకీయ ప్రయత్నానికి మొదట్లోనే ఎదురు దెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామంతో విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం మరోసారి చర్చగా మారింది.