బ్రేకింగ్: మరికొద్దిసేపట్లో కర్నాటక ఎన్నికల షెడ్యూల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎలక్షన్ కమిషన్ మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎలక్షన్ కమిషన్ మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రధాన కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్లు మీడియా సమావేశం ద్వారా షెడ్యూలును ప్రకటించనున్నారు. మొత్తం 224 సభ్యులున్న అసెంబ్లీ కాలపరిమితి మే నెలలో ముగియనున్నది. ఆ లోపునే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తరఫున ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించి ఏర్పాట్లపై అధ్యయనం చేశారు. శాంతిభద్రతల నిర్వహణ, పరీక్షల షెడ్యూలు, సెలవులు, వాతావరణ పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది లభ్యత తదితరాలపై వివరాలను సేకరించారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ 11.30 గంటలకు వెల్లడించనున్నది. నోటిఫికేషన్ తేదీ, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నదీ షెడ్యూలు ద్వారా కమిషన్ స్పష్టత ఇవ్వనున్నది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ప్రచారం ముమ్మరం చేశాయి. కొన్ని పార్టీలు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. జేడీఎస్ సైతం గెలుస్తామన్న ధీమాతో యాత్రలను కొనసాగిస్తూ ఉన్నది. భారత్ రాష్ట్ర సమితి పేరుతో కర్నాటకలోనూ పార్టీని విస్తరించాలనుకుంటున్న అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అనేది వెల్లడి కావాల్సి ఉన్నది.