Maharashtra : హైదరాబాద్‌లో మరో అన్నగా నేను ఉంటా.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Update: 2024-11-16 09:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ చంద్రాపూర్ నియోజకవర్గం గుగూస్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ షిండే (Eknath Shinde).. అజిత్ పవార్ (Ajit Pawar) కాలరాశారని మండిపడ్డారు. షిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రాపూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్‌ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు.. హైదరాబాద్‌లో మరో అన్నగా నేను ఉంటా.. అంటూ వెల్లడించారు.

మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి వాహనం తనిఖీ

చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని మహారాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఎన్నికల (maharashtra Elections) ప్రచారం నిర్వహించబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్రంలోని నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. దీంతో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

Tags:    

Similar News