అక్రమంగా అబార్షన్లు చేసిన డాక్టర్ అరెస్ట్.. ఒక్కోదానికి రూ.30 వేలు
అక్రమంగా అబార్షన్లు చేసిన ఓ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
బెంగళూరు: అక్రమంగా అబార్షన్లు చేసిన ఓ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మైసూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో గడిచిన మూడేళ్లలో డాక్టర్ చందన్ బల్లాల్ 900 మందికి అక్రమంగా అబార్షన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతవారం సైతం ఓ ఆసుపత్రిలో అబార్షన్‌కు ఏకంగా రూ.30,000 వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో డాక్టరుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ నిసార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హాస్పిటల్ మేనేజర్ మీనా, రిసెప్షనిస్ట్ రిజ్మా ఖాన్‌ను కూడా అరెస్ట్ చేశారు.
గత నెల మైసూరు సమీపంలోని జిల్లా కేంద్రమైన మాండ్య పట్టణంలో ఇద్దరు అనుమానితులైన శివలింగ గౌడ, నయన్ కుమార్‌లను అబార్షన్‌ల రాకెట్ కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు మాండ్యలో బెల్లం తయారీ యూనిట్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అధికారిక పత్రాలు లేని స్కాన్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.