MODI: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ గుణపాఠాలు నేర్చుకోలేదు

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు యావత్ దేశం రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు.

Update: 2024-07-26 06:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు యావత్ దేశం రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ (Kargil Vijay Diwas) సందర్భంగా శుక్రవారం లఢక్ లో ద్రాస్ లోని యుద్ధస్మారకాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించ వారిని హెచ్చరించారు. దాయాది దశం పాకిస్థాన్(Pakistan) పై విరుచుకు పడ్డారు. 'శత్రువు'కు గట్టి సమాధానం చెబుతామని పేర్కొన్నారు. ‘‘గతంలో పాకిస్థాన్‌ చేసిన నీచ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, గత చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. టెర్రర్ మాస్టర్స్(పాకిస్థాన్) నా గొంతును నేరుగా వినగలిగే ప్రదేశం నుండి మాట్లాడుతున్నా. ఉగ్రవాదులను పోషిస్తున్న వారి దుర్మార్గపు ఉద్దేశాలు ఎన్నటికీ ఫలించవు అని చెప్పాలనుకుంటున్నా. మా సైనికులు ఉగ్రవాదాన్ని అణచివేస్తారు. శత్రువులకు దీటైన జవాబిస్తాం” అని మోడీ అన్నారు. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్ సహాయంతో పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.

షింకున్ లా టన్నెల్ ప్రారంభం

అంతకుముందు, యుద్ధ స్మారకం దగ్గర నివాళుర్పించిన మోడీ.. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లడఖ్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ ఆగస్టు 5కి ఐదేళ్లు అవుతుందన్నారు. “నేడు కాశ్మీర్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుంది. జీ 20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి జమ్ముకశ్మీర్ ని పరిగణలోకి తీసుకున్నారు. లడఖ్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దశాబ్దాల తర్వాత కాశ్మీర్‌లో సినిమా హాల్‌ ప్రారంభమైంది. మూడున్నర దశాబ్దాల తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో తజియా ఊరేగింపు జరిగింది.” అని మోడీ ప్రసంగించారు. అదే విధంగా, షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణపనులను ప్రారంభించారు. టన్నెల్‌ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్‌గా తొలి బ్లాస్ట్‌ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాలను వేగంగా తరలించేందుకు, సైనిక సామగ్రిని చేరవేసేందుకు ఈ సొరంగం సమర్థంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది.

అగ్నిపథ్ పై ఏమన్నారంటే?

అగ్నిపథ్‌ పథకం(Aginpath Scheme)పై విపక్షాలు చేస్తోన్న విమర్శలపై మోడీ ధ్వజమెత్తారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తోన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆయన.. దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని తెలిపారు. కొంతమందికి ఆర్మీ అంటే.. రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయడం, కవాతులు చేయడం అని అనుకుంటారని విమర్శించారు. అయితే, మనకు సైన్యం అంటే 140 కోట్ల మంది దేశ ప్రజల విశ్వాసం అని అన్నారు. దురదృష్టవశాత్తూ దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాన్ని కొందరు రాజకీయాల అంశంగా మార్చారని అన్నారు. ఆర్మీ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి ఆర్మీని నిర్వీర్యం చేసిన వాళ్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.


Similar News