'కశ్మీర్‌ను ఒక్కదాన్నే ప్రత్యేకంగా చూడక్కర్లేదు'.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

ఇతర రాష్ట్రాలలాగే జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా సూచించాలనే స్పష్టమైన లక్ష్యంతోనే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Update: 2023-08-24 16:20 GMT

న్యూఢిల్లీ : ఇతర రాష్ట్రాలలాగే జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా సూచించాలనే స్పష్టమైన లక్ష్యంతోనే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1939లో బ్రిటీష్ ప్రావిన్సులు, రాచరిక సంస్థానాలను బ్రిటీష్ ఇండియాలోకి విలీనం చేసే సమయానికి కశ్మీర్‌తో పాటు మరో 62 సంస్థానాలకూ సొంత రాజ్యాంగాలు ఉండేవని తెలిపింది. మరో 286 సంస్థానాలు సొంత రాజ్యాంగాలను సిద్ధం చేసుకునే ప్రక్రియను అప్పట్లో మొదలుపెట్టాయనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఒక్క కశ్మీర్‌కే సొంత రాజ్యాంగం ఉండేదనడం అవాస్తవమని స్పష్టం చేసింది.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై 10వ రోజు (గురువారం) ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్ 370లోని ఉప విభాగాలలో ‘తాత్కాలిక’ అనే పదాన్ని వాడినంత మాత్రాన.. ఆ మొత్తం ఆర్టికల్ ను రద్దు చేయాలనే అర్ధంగా పరిగణించడం సరికాదని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపించారు. ‘ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు అనే వాదన తప్పు.. దాన్ని తీసివేయకూడదని అనడం కూడా తప్పే.

దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ప్రత్యేకాధికారాలు ఉన్నప్పుడు.. ఆర్టికల్ 370 మాత్రమే ప్రత్యేకం ఎలా అవుతుంది’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు కాక ముందు కశ్మీర్ ప్రజలు తమ ఉనికిని తామే ప్రశ్నించుకునే పరిస్థితి ఉండేదని, దాన్ని విదేశీ శక్తులు అదునుగా మార్చుకునేవని కోర్టుకు తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. అయితే ఇండియన్ యూనియన్‌తో విలీన ఒప్పందాలపై సంతకం చేయాలని రాచరిక సంస్థానాల జాబితాను ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.


Similar News