Jindal Group: జిందాల్ గ్రూప్ ఉద్యోగి నుంచి మహిళకు వేధింపులు..!

జిందాల్ గ్రూప్(Jindal Group) ఉద్యోగి విమానంలో మహిళను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో తనని వేధించినట్లు బాధితురాలు ఎక్స్ వేదికగా తెలిపింది.

Update: 2024-07-20 06:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జిందాల్ గ్రూప్(Jindal Group) ఉద్యోగి విమానంలో మహిళను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో తనని వేధించినట్లు బాధితురాలు ఎక్స్ వేదికగా తెలిపింది. జిందాల్ గ్రూప్ కి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కుమార్ సరోగి(65) ఒక మహిళకు అసభ్యకరమైన వీడియోలు చూపించి వేధించినట్లు తెలుస్తోంది. దినేష్ కుమార్ సరోగి తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును సదరు మహిళ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. జిందాల్ ఉద్యోగిగా దినేష్ తనతో పరిచయం చేసుకున్నాడని పేర్కొంది. తాను బోస్టన్ వెళ్లేందుకు అబుదాబిలో ట్రాన్సిట్ ఫ్లైట్ తీసుకుంటానని దినేష్ తో చెప్పినట్లు వెల్లడించింది. ఇద్దరి మధ్య సంభాషణలు జరిగాయని.. ఆ తర్వాత తన ఫోన్ లో అసభ్యకర క్లిప్స్ చూపించాడని పేర్కొంది. అతను తనను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాను భయంతో వాష్‌రూం వైపు పరిగెత్తానని పేర్కొంది. తర్వాత విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వెంటనే స్పందించిన సిబ్బంది తనకు వేరే సీటు కేటాయించారని చెప్పారు. తాను వేరే సీటుకి మారిన తర్వాత కూడా, ఆ మహిళ ఎక్కడికి వెళ్లిందని విమాన సిబ్బందిని పదేపదే అడుగుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను ఆమె ఎక్స్‌లో జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్‌ని ట్యాగ్ చేసింది.

స్పందించిన జిందాల్ అధినేత

మహిళ ఫిర్యాదుపై బీజేపీ ఎంపీ, జిందాల్ సంస్థ అధినేత నవీన్ జిందాల్ స్పందించారు. తమ సంస్థ ఇలాంటి విషయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘ఈ విషయాన్ని వెల్లడించినందుకు ధన్యవాదాలు.. మీరు చేసిన పనిని చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి వాటిలో మాకు జీరో టాలరెన్స్ పాలనీ ఉంది. దీనిపై విచారణ జరపాలని మా బృందాన్ని కోరాను. కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు. ఇకపోతే, మిస్టర్ జిందాల్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆ మహిళ.. తాను నిందితుడిపై తీసుకునే చర్య కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.


Similar News