చైనా మంత్రి క్విన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో భేటీ అయ్యారు.

Update: 2023-05-04 12:54 GMT

బెనౌలిమ్ (గోవా): భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో భేటీ అయ్యారు. లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వివాదంపై చర్చించినట్టు తెలుస్తోంది. షాంఘై కొ-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భాంగా ఈ చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని భేటీకి ముందే ఈ విషయం తెలిసిన వారు చెప్పారు. గత రెండు నెలల్లో జైశంకర్, గ్యాంగ్ సమావేశం కావడం ఇది రెండోసారి. జి20 విదేశాంగ మంత్రల సమావేశం సందర్భంగా కూడా చైనా మంత్రి భారత్‌కు వచ్చారు. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశముందని అప్పుడు కూడా జైశంకర్ చైనా విదేశాంగ మంత్రితో అన్నారు.

గతవారంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫుతో సమావేశమయ్యారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లఘించిడం ద్వారా భారత్-చైనా సంబంధాలు దెబ్బతింటాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని చైనా మంత్రికి రాజ్‌నాథ్ సూచించారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశాల సందర్భంగా ఏప్రిల్ 27న ఈ భేటీ జరిగింది. 2020 జూన్‌లో గాల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్రమైన సైనిక సంఘర్షణగా దీనిని పరిగణించారు.

Tags:    

Similar News