రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీ దాడులు

దేశవ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయ పార్టీలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళిపిస్తోంది.

Update: 2022-09-07 10:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయ పార్టీలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళిపిస్తోంది. రిజిస్టర్ అయి గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. తాజాగా బుధవారం దేశవ్యాప్తంగా ఈసీ జాబితాలో ఉండి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఐటీ దాడులు సంచలనంగా మారాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, గుజరాత్, ఉత్తర​ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల ముసుగులో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతున్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగా ఐటీ శాఖ విచారణ చేపట్టింది.

ఎన్నిక సంఘానికి కూడా ఇదే విషయంలో ఫిర్యాదులు రావడంతో ఐటీ శాఖకు ఈసీ సిఫార్సు చేసింది. దీంతో ఇవాళ దేశంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలతో పాటు వాటితో అనుబంధంగా ఉన్న సంస్థలు, నిర్వాహకుల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ రాజకీయ పార్టీలు చట్టబద్ధమైన సమ్మతి లేకుండా విరాళాలు స్వీకరించడం ద్వారా తీవ్రమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్టర్ అయి గుర్తింపు పొందని 2,100 రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఇటీవల రిజిస్టర్డ్ జాబితా నుండి 87 రాజకీయ పార్టీలను ఈసీ తొలగించింది. ఈ పార్టీలన్నీ కూడా తమ పేరును నమోదు చేసుకుని ఆపై గుర్తింపు పొందలేదని ఈసీ పేర్కొంది. వెరిఫికేషన్ సమయంలో రాజకీయ పార్టీల జాడ తెలియరావడం లేదని, ఎన్నికల చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈసీ గుర్తించింది. పలు బోగస్ రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడినట్లు పసిగట్టిన అధికారులు.. ఇవాళ రంగంలోకి దిగారు.

ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో యూపీ సుల్తాన్ పూర్ కేంద్రంగా కార్యకలాపాలు జరుపుతున్న 'అప్నా దేశ్ పార్టీ' వందల కోట్ల విరాళాలు సేకరించిందని తెలిపారు. ఈ పార్టీకి 3 సంవత్సరాలలో రూ.380 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఐటీ శాఖ అంచనా వేస్తోంది. ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్‌కు చెందిన గడియారాలు అమ్మే వ్యక్తి అని అధికారులు గుర్తించారు. అలాగే లక్నోలో రాష్ట్రీయ క్రాంతికారీ సమాజ్‌వాదీ పార్టీ అధినేత గోపాల్ రాయ్ నివాసంలో ఐటీ బృందం సోదాలు చేపట్టింది. గోపాల్ రాయ్ అనేక ఎన్జీవోలు నడుపుతున్నాడని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలపై ఐటీ శాఖ దాడులు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అంశంలో మరిన్ని సంచలనాలు చూడబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

రాజకీయ పార్టీలకు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును ఆసరాగా చేసుకుని కొంత మంది తమ పార్టీని నమోదు చేసుకుని పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారని, ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన ఆడిట్ నివేదికలు ఇవ్వకుండా కేవలం అక్రమ ధనాన్ని రూట్ మార్చేందుకే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2018-19లో ఆయా రాజకీయ పార్టీలు రూ. 445 కోట్ల పన్ను మినహాయింపు పొందగా 2019-20లో రూ. 608 కోట్లు పన్ను మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపడుతున్న సోదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Similar News