భారత్ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు : ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్

వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎదుగుతున్న నక్షత్రమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు.

Update: 2023-02-24 16:30 GMT

న్యూఢిల్లీ: వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎదుగుతున్న నక్షత్రమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఇర్ఐ) 61వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘2022 సెప్టెంబర్‌లో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ స్థానం మనకు అంత తేలికగా రాలేదు. ప్రపంచంలో భారత్ ఎదుగుదలలో వ్యవసాయ రంగం గణనీయమైన ఫలితాన్ని సాధించింది.

ఇది మనకొక మైలురాయిని సంపాదించి పెట్టింది’ అని ధంఖర్ చెప్పారు. వ్యసాయం భారత్‌కు వెన్నెముక లాంటిదని అన్నారు. ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం ఎదుగుతున్న నక్షత్రమని ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు ప్రతి ఒక్కరూ భారత్ వైపు చూస్తున్నారని అన్నారు. ‘భారత్ ఎదుగుదల ఆపలేనిది. అవకాశాలకు, పెట్టుబడులకు భారత్ అందరికీ ఇష్టమైన ప్రదేశం’ అని ఆయన చెప్పారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు అంగీకారయోగ్యమైన విధానాలు అమలులో ఉన్నాయన్నారు. ‘ఈ దశాబ్దం చివరి నాటికి భారత దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’ అని ఆయన చెప్పారు. భారత్ స్వాతంత్రత్యం సాధించి 2047లో శతజయంతి జరుపుకునే నాటికి దీన్ని సాధించేందుకు యువత ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ధంఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో 14 మంది విదేశీయులతో సహా 402 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి పట్టాలను అందుకున్నారు.

Tags:    

Similar News