Delhi: శాశ్వతంగా టపాసులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ ప్రభుత్వం టపాసులపై శాశ్వత నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఏడాది పొడవునా టపాసులపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు గురువారం సమాచారం అందించింది. ఢిల్లీ ప్రభుత్వం టపాసులపై శాశ్వత నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది మొత్తం అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకాలు, నిల్వ లాంటి అన్ని కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఢిల్లీ విధించిన ఇదే రకమైన నిషేధాన్ని ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే విధమైన చర్యలను అమలు చేయాలని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆంక్షల అమలుకు ఆదేశాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఇటీవల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో గాలి నాణ్యత 'అత్యంత పేలవమైన', 'తీవ్రమైన' దశకు చెరుకుంది. ఈ ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ రాష్ట్రాలు చర్యలపై అసంతృత్పి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్‌సీఆర్‌లో భాగమైన అన్ని రాష్ట్రాలు ఒకే నిర్ణయం తీసుకున్నప్పుడే నిషేధం ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడింది.