Kuwait Airport : కువైట్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న భారతీయులు.. 13 గంటలుగా ‘నో’ ఫుడ్
ముంబాయి నుంచి మాంచెస్టర్ వెళ్లాల్సిన విమానం కువైట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో భారతీయ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ముంబాయి నుంచి మాంచెస్టర్ వెళ్లాల్సిన విమానం కువైట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో భారతీయ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 13 గంటలుగా ఇబ్బంది పడుతున్నా కనీసం ఆహార సదుపాయం కల్పించలేదని వాపోయారు. ఇంజన్‌లో మంటలు రావడంతో ఫ్లైట్‌ను కువైట్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ లైన్స్ సంస్థ కేవలం యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ ప్రయాణికులకు మాత్రమే వసతులు కల్పించినట్లు ప్యాసింజర్లు ఆరోపించారు. ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఈస్ట్ ఆసియా పాస్ట్‌పోర్టుల ఉన్న వారిని వేధించినట్లు ఆరోపించారు. అర్జూ సింగ్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ..‘నాలుగు గంటల పాటు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి ఆహారం, కప్పుకోవడానికి బ్లాంకెట్స్ అడిగితే స్పందించలేదు. ఎయిర్ పోర్టు అధికారుల వెనక రెండు గంటల పాటు తిరిగినా లెక్క చేయలేదు.’ అన్నాడు. ఈ అంశంపై కువైట్‌లోని భారతీయ ఎంబసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. వెంటనే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ ఎయిర్ సంస్థను కోరినట్లు స్పష్టం చేసింది. రెండు ఎయిర్ పోర్టులలో ఉన్న లాంజ్‌లను వసతి కోసం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపింది.