Biren Singh: మణిపూర్‌లో 29 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్.. సీఎం బిరేన్ సింగ్

ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో 29 మంది అనుమానిత బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసినట్టు మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు.

Update: 2024-12-02 16:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇంఫాల్ పశ్చిమ (Imphal west) జిల్లాలో 29 మంది అనుమానిత బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసినట్టు మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ (Biren singh) తెలిపారు. వీరంతా అసోంలో జారీ చేసిన ఆధార్ కార్డులను కలిగి ఉన్నట్టు చెప్పారు. సోమవారం ఆయన ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. మయాంగ్ ఇంఫాల్ బెంగూన్ ప్రాంతంలోని బేకరీలో పనిచేస్తున్న బంగ్లాదేశీయులను పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారు మణిపూర్ ప్రభుత్వ ఇన్నర్ లైన్ పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టం చేశారు. వారి వద్ద ఉన్న పత్రాలు అసోంకు చెందినవని గుర్తించినందున అందరినీ అసోం అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు రాష్ట్రంలో ఇంకా ఉండొచ్చని తెలిపారు. వారందరినీ త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్‌లోని సైనిక శిబిరం నుండి తప్పిపోయిన లైష్‌రామ్ కమల్‌బాబు సింగ్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..భద్రతా దళాలు కమల్ కోసం వెతుకుతున్నారని, ఇంకా ఆచూకీ లభించలేదన్నారు. కాగా, ఇప్పటికే అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్‌లో 29 మంది బంగ్లాదేశీయులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News