Pm modi: భవిష్యత్ యుద్ధంలో కాదు బుద్ధుడిలో ఉంది.. ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులను ఎల్లప్పుడూ దేశ రాయబారులుగానే పరిగణిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రవాస భారతీయులను ఎల్లప్పుడూ దేశ రాయబారులుగానే పరిగణిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి భారతీయులను కలిసి వారితో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. వారి నుంచి లభించే ప్రేమ, ఆశీర్వాదాలు మరువలేనివని, ఎప్పుడూ తనతోనే ఉంటాయని కొనియాడారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో గురువారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది మాత్రమే కాదని మన జీవితంలో ఒక అంతర్భాగమని తెలిపారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా స్థానిక సమాజంతో కనెక్ట్ అవుతారు, అక్కడి సంప్రదాయాలను గౌరవిస్తారని ప్రశంసించారు. గత దశాబ్ద కాలంలో అనేక మంది ప్రపంచ నాయకులను కలిశానని, వారందరూ ప్రవాస భారతీయులను మెచ్చుకున్నారని నొక్కి చెప్పారు. అక్కడి సమాజంలో మీరందరూ చూపే సామాజిక విలువలే దీనికి కారణమని తెలిపారు.
పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి
21వ శతాబ్దపు భారతదేశంలో ఎంతో వేగంగా అభివృద్థి జరుగుతోందని గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, దానికి ఎంతో దూరం లేదని తెలిపారు. భారతదేశంలోని ప్రతి రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని.. పునరుత్పాదక ఇంధనం, విమానయానం, ఎలక్ట్రిక్ మొబిలిటీలో రికార్డులు సృష్టిస్తోందని తెలిపారు. మెట్రో నెట్‌వర్క్‌లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను తయారు చేస్తోందని గుర్తు చేశారు. భారత్ సాధించిన విజయాలను ప్రపంచం చూస్తోందన్నారు. చంద్రయాన్ శివశక్తి పాయింట్‌కి చేరుకున్నప్పుడు, డిజిటల్ ఇండియా శక్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నప్పుడు మనమంతా గర్వపడ్డామని కొనియాడారు.
ఒడిశాకు గొప్ప వారసత్వం
ఒడిశా భారతదేశ గొప్ప వారసత్వానికి ప్రతిబింబమని తెలిపారు. ఈ రాష్ట్రంలో అడుగడుగునా దేశ వారసత్వం కనిపిస్తుందన్నారు. ఖడ్గ బలంతో సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే సమయం ఉన్నప్పుడు మన అశోక చక్రవర్తి ఇక్కడ శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తు చేశఆరు. అందుకే ఈ రోజు భారతదేశ భవిష్యత్ యుద్ధంలో లేదని, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. భారత్ అభిప్రాయాలను ప్రపంచ దేశాలన్నీ శ్రద్దగా వింటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూ, ఒడిశా గవర్నర్ హరి బాబు, సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు జైశంకర్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లు హాజరయ్యారు.
ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
విదేశీ భారతీయుల కోసం ప్రత్యేక పర్యాటక రైలు ‘ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్’ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది మూడు వారాల పాటు దేశంలోని అనేక పర్యాటక, మతపరమైన ప్రదేశాలకు ఎన్నారైలను తీసుకెళ్తుంది. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కింద దీనిని నిర్వహిస్తున్నారు.