‘మేక్-ఇన్-ఇండియా’ ప్రాజెక్ట్‌పై భారత్ ఫోకస్.. 97 డ్రోన్లు కొనేందుకు రెడీ

ఓ వైపు ఫ్రాన్స్, అమెరికాల నుంచి అధునాతన యుద్ధ విమానాలు, డ్రోన్లను కొనేందుకు రెడీ అవుతున్న భారత్

Update: 2023-07-18 12:12 GMT

న్యూఢిల్లీ : ఓ వైపు ఫ్రాన్స్, అమెరికాల నుంచి అధునాతన యుద్ధ విమానాలు, డ్రోన్లను కొనేందుకు రెడీ అవుతున్న భారత్.. మరోవైపు ‘మేక్-ఇన్-ఇండియా’ ప్రాజెక్ట్‌పైనా ఫోకస్ పెట్టింది. చైనా, పాకిస్తాన్ బార్డర్‌లలో నిఘాను పెంచే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో’ మేక్-ఇన్-ఇండియా’ డ్రోన్స్‌ను కొనేందుకు భారత రక్షణ శాఖ సమాయత్తం అవుతోంది. దాదాపు రూ. 10వేల కోట్లు విలువైన 97 డ్రోన్‌లను ‘మేక్-ఇన్-ఇండియా’ ప్రాజెక్ట్ కింద కొనుగోలు చేయనున్నారు.

జూన్ 15న జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కంటిన్యూగా దాదాపు 30 గంటల పాటు ప్రయాణించే కెపాసిటీ కలిగి.. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అవసరాలను తీర్చగలిగే డ్రోన్స్‌నే ఇందుకోసం ఎంపిక చేస్తారని కథనాలు వస్తున్నాయి. ఈ డ్రోన్లను సముద్ర తీరాలు, చైనా, పాక్ బార్డర్ లలో మోహరించనున్నట్టు సమాచారం. అయితే ఎక్కువ సంఖ్యలో డ్రోన్స్‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు కేటాయించనున్నారు.

"తపస్" డ్రోన్ గురించి..

రూ. 10 వేల కోట్లతో కొనుగోలు చేయనున్న ‘మేక్-ఇన్-ఇండియా’ డ్రోన్ల లిస్టులో ప్రధాన పోటీదారుగా "తపస్" డ్రోన్ పేరు వినిపిస్తోంది. దీన్ని రుస్తోమ్-II అని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్‌ను తొలిసారిగా కర్ణాటకలోని ఏటీఆర్ చిత్రదుర్గలో 2023 జూన్ 27న ప్రదర్శించారు. "తపస్" డ్రోన్‌ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పటికే భారత సైన్యం దగ్గర ఇజ్రాయెల్‌కు చెందిన 46 హెరాన్ డ్రోన్లు ఉన్నాయి.

వీటిని అప్ గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని “ప్రాజెక్ట్ చీతా” పేరుతో చేపట్టనున్నారు. ఇందులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల సహకారంతో.. ఇప్పటికే సేవలో ఉన్న డ్రోన్‌లను అప్‌గ్రేడ్ చేసే బాధ్యతను ఇది తీసుకుంటుంది. “ప్రాజెక్ట్ చీతా”లో భాగమైన ఈ అప్ గ్రేడేషన్ ప్రక్రియలో 60 శాతానికి పైగా భారతీయ కంటెంట్‌ను ఉపయోగిస్తారు.


Similar News