టారిఫ్‌లపై ట్రంప్‌ను బుజ్జగిస్తోన్న ఇండియా!

ఇప్పటకే బోర్బన్ విస్కీ, బాదాం, వాల్‌నట్స్, కాన్‌బెర్రీస్, పిస్తా, పప్పులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించింది.

Update: 2025-03-28 17:19 GMT
టారిఫ్‌లపై ట్రంప్‌ను బుజ్జగిస్తోన్న ఇండియా!
  • whatsapp icon

- యూఎస్ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల తగ్గింపు

- ఇప్పటికే పలు పన్నులను తగ్గించిన భారత్

- స్టార్ లింక్ విషయంలోనూ ఉదాసీన వైఖరి

- ఏప్రిల్ 2 నుంచి పెరగనున్న అమెరికా టారిఫ్‌లు

- టారిఫ్‌ల పెంపు వల్ల నష్టమేం లేదంటున్న నీతీ ఆయోగ్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పలు దేశాలపై పరస్పర టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు ఎక్కువగా కెనడా, మెక్సికో, చైనా, భారత్ నుంచి వస్తువులు దిగుమతి అవుతుంటాయి. దీంతో ఆయా దేశాలపై పరస్పర టారిఫ్‌లను 25 శాతం మేర పెంచడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై వేసిన టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. అయితే కెనడా, చైనాలు టారిఫ్ పెంపుపై పెద్దగా స్పందించక పోయినా భారత్ మాత్రం ఇప్పటికే అమెరికాను బుజ్జగించే చర్యలు మొదలు పెట్టింది. భారత్‌కు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 23 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో సగానికి సగం వాటికి సుంకాలు తగ్గించాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా అసిస్టెంట్ ట్రేడ్ రిప్రజెంటేటీవ్ బ్రెండన్ లించ్‌తో న్యూఢిల్లీలో వరుసగా జరిగిన సమావేశంలో ఇప్పటకే బోర్బన్ విస్కీ, బాదాం, వాల్‌నట్స్, కాన్‌బెర్రీస్, పిస్తా, పప్పులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుందని, ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల టారిఫ్‌పై భారత్ ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుతమ సుంకాలు 30 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. పప్పులపై 10 శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. వీటిని తగ్గించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అమెరికా నుంచి ప్రస్తుతం 15 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచుతామని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చింది. దీంతో పాటు ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ డిజిటల్ ప్రకటనలపై 6 శాతం ఉన్న పన్నును రద్దు చేస్తుందని ఇప్పటికే ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని వల్ల గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి సంస్థలకు భారీగా లబ్ది చేకూరనుంది. భారత్ ఇప్పటికే లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్ వంటి వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ టారిఫ్‌ను తగ్గించింది. వీటి గరిష్ట సుంకాలను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించారు.

భారత్‌లో స్టార్‌లింక్ సేవల విస్తరణకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇప్పటికే రిలయన్స్, ఎయిర్ టెల్ వంటి సంస్థలతో స్టార్ లింక్ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రం నుంచి తుది నియంత్రణ అనుమతులు పొందడానికి దగ్గరగా ఉంది. ప్రతీ ఏడాది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్లను యాడ్ చేసుకోవాలని స్టార్ లింక్ భావిస్తోంది.

కాగా, పరస్పర సుంకాలను విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపదని, పైగా దేశంలో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రవాకర్ సాహూ శుక్రవారం చెప్పారు. దిగుమతుల్లో 50 శాతం వాటా కలిగిన మెక్సికో, చైనా, కెనడాలతో పోలిస్తే భారత్ వారికి అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ పరస్పర సుంకాలు నిర్ధిష్ట రంగాలను మాత్రమే ప్రభావితం చేస్తాయి. అయితే అవి మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడతాయని ప్రవాకర్ అన్నారు. ఇండియాపై టారిఫ్‌ల ప్రభావం ఎలా ఉండబోతుందనే వివరాలను నీతి ఆయోగ్ ట్రేడ్ వాచ్ మూడో ఎడిషన్‌లో వివరిస్తామని చెప్పారు.అమెరికా మార్కెట్‌లో మన పోటీదారులపై కూడా సుంకాలు విధిస్తున్నారు. దీంతో పోల్చి చూస్తే మనం చాలా మెరుగ్గా ఉన్నామని అన్నారు.2018లో అమెరికా సుంకాలు విధించిన తర్వాత దిగుమతుల్లో చైనా వాటా తగ్గిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News