Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం చేయగలదని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 09:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం చేయగలదని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో 2015లో మోడీతో లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఘటనను కూడా ఆయన గుర్తుచేశారు. ‘‘మా దేశంలో ప్రధానమంత్రి లేదా పార్టీ నాయకుడు 4,000 మందితో మాట్లాడితే చాలా అదృష్టంగా భావిస్తాం. కానీ, ఓ ప్రత్యేక సందర్భంలో వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సదస్సులో నేను మాట్లాడుతూ.. యూకేకు తొలి మహిళా ప్రధానిని అందించిన కన్జర్వేటివ్‌ పార్టీనే.. దేశానికి బ్రిటిష్‌-ఇండియన్‌ ప్రధానిని కూడా ఇస్తుందని చెప్పాను. అప్పుడు అక్కడే వెనుక వరుసలో కూర్చొన్న కుర్రాడు రిషి సునాక్‌ ప్రధాని అవుతారని నాకు తెలియదు’’ అని అన్నారు.

స్పందించిన పుతిన్

ఇకపోతే, యుద్ధంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మోడీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా స్పందించారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే యుద్ధంలో మాత్రం రష్యానే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ త్వరలో మాస్కోలో పర్యటించనున్నారు. అయితే, బ్రిక్స్ వెస్ట్రన్ కంట్రీలకు వ్యతిరేక గ్రూపు కాదని.. అవి లేని గ్రూప్ అని మోడీ చేసిన వ్యాఖ్యలను పుతిన్ సమర్థించారు. ఇక, బ్రిక్స్ సమ్మిట్ సందర్బంగా సభ్య దేశాల అధినేతలతో భారత ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.


Similar News