India Canada: ట్రూడో ఆరోపణలు అవాస్తవం.. సాక్ష్యాధారాల వాదనలను తిరస్కరించిన భారత్!

నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌కు సరైన సాక్ష్యాలను అందించిందని ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి.

Update: 2024-10-15 12:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా భారత్‌కు సరైన సాక్ష్యాలను అందించిందని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. హత్యకు సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలను కెనడా అందజేయలేదని తెలిపాయి. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని పలుమార్లు ఆరోపించినప్పటికీ అందుకు గల స్పష్టమైన వివరాలు ఎప్పుడూ ఇవ్వలేదని స్పష్టం చేసినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. అసంబద్ధమైన ఆరోపణలు చేయడం కెనడాకు మొదటి నుంచి అలవాటైందని ఫైర్ అయినట్టు వెల్లడించాయి.

భారత హైకమిషనర్, ఇతర అధికారులపై దృష్టి సారించడం ద్వారా కెనడా ఇరు దేశాల మధ్య దౌత్య వివాదాలను మరింత పెంచిందని భారత్ ఉన్నతాధికారులు ఆరోపించారు. కాగా, కెనడా గడ్డపై భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా తీవ్రమైన నేర కార్యకలాపాలకు పాల్పడుతోందని ట్రూడో ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని గతేడాది ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి తీవ్ర ఆరోపణలు చేయడంతో దౌత్య వివాదాలు మరింత పెరిగాయి. 


Similar News