విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు.. ఆదివారం ఒక్కరోజే 24 ఘటనలు

Update: 2024-10-20 12:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ తరహా బెదిరింపులు మాత్రం ఆగడం లేదు సరికదా.. రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక విమానయాన సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. గత వారం రోజుల నుండి 100 బెదిరింపులు రాగా.. కేవలం ఆదివారం ఒక్కరోజే 24 ఘటనలు ఎదురయ్యాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ వంటి పలు సంస్థలకు నేడు బెదిరింపులు వచ్చాయి. పలు విమానాలు గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత కూడా బెదిరింపులు ఆగలేదు. ఈ ఘటనల వలన సిబ్బంది అత్యవసర తనిఖీలు చేపడుతుండటంతో అనేక విమాన సర్వీసులు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. గత వారం నుండి జరుగుతున్న ఈ వ్యవహారంపై 'బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ' శనివారం విమానయాన సంస్థల సీఈవోలతో అత్యవసర సమావేశం అయింది. ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులు అన్నీ ఫేక్ అయినప్పటికీ వాటిని తేలిగ్గా తీసుకోలేక పోతున్నామని సీఈవోలు వెల్లడించారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర పౌర విమానయానశాఖ సిద్ధం అవుతోంది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై లిస్టులో చేర్చాలని విమానయాన సంస్థలకు సూచించింది.


Similar News