Kolkata doctor rape-murder:దీదీ సర్కారు పనితీరుపై ఫైర్ అయిన కేంద్రం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫైర్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్రం మండిపడింది.

Update: 2024-08-31 04:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫైర్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ.. పనితీరు బాగా లేదని విమర్శించారు. ‘ దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు, శిక్షలు అమల్లో ఉన్నాయి. కానీ, బెంగాల్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరు బాగాలేదు. అక్కడ 48,600 లైంగికదాడులు, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. లైంగికదాడులు, పోక్సో కేసులను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం అదనంగా 11 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అవేమీ చేయలేదు. అవసరాలకు అనుగుణంగా ఆ కోర్టులు పోక్సో, లైంగికదాడి కేసులను విచారిస్తాయి’ అని అన్నపూర్ణాదేవీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. బెంగాల్ లో ముందుగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.

మోడీకి దీదీ లేఖ

మహిళలకు భద్రత కల్పించడం గురించి దీదీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసుపై ప్రధాని మోడీ నేరుగా స్పందించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఆగస్టు 22న ఈ ఘటనపై మోడీకి లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమతా లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవీ స్పందించారు.


Similar News