ఈ నోటీస్ వస్తే అధికారి పేరు తనిఖీ చేయాలి..సైబర్ క్రైమ్ యూనిట్ కీలక సూచన
ప్రభుత్వ కార్యాలయం నుంచి ఈ మెయిల్ ద్వారా అనుమానాస్పద ఈ-నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీసులో పేర్కొన్న అధికారి పేరును ధ్రువీకరించడానికి ఇంటర్నెట్‌ను తనిఖీ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయం నుంచి ఈ మెయిల్ ద్వారా అనుమానాస్పద ఈ-నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీసులో పేర్కొన్న అధికారి పేరును ధ్రువీకరించడానికి ఇంటర్నెట్‌ను తనిఖీ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ తెలిపింది. ప్రభుత్వ ఈ-నోటీస్‌లో పంపిన నకిలీ ఈ మెయిల్‌ల గురించి వినియోగదారులు తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పబ్లిక్ అడ్వర్టైజ్‌మెంట్‌లో పేర్కొంది. మోసగాళ్లు అటాచ్‌మెంట్‌తో నకిలీ ఈ-మెయిల్‌లను పంపడానికి వివిధ చిరునామాలను ఉపయోగిస్తారని వెల్లడించింది.
అటువంటి ఏదైనా ఈ మెయిల్‌ను స్వీకరించేవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్‌తో కూడిన ఈ మెయిల్‌లకు ప్రతిస్పందించరాదని తెలిపింది. అనుమానాస్పద సమాచారం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కాగా, సైబర్ నేరాలను సమగ్ర పద్ధతిలో ఎదుర్కోవడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గత ఏడాది ఆగస్టులోనూ ఇదే విధమైన సలహాను జారీ చేసింది.