Donald Trump: బందీలను విడిచిపెట్టకపోతే నరకయాతన చూపిస్తా.. హమాస్ కు ట్రంప్ వార్నింగ్
హమాస్ మిలిటెంట్లపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విరుచుకుపడ్డారు. హమాస్ చెరలో ఉన్న బందీలను(Hamas Hostage) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ మిలిటెంట్లపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విరుచుకుపడ్డారు. హమాస్ చెరలో ఉన్న బందీలను(Hamas Hostage) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు చేపడతా. ఈలోగా బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరయాతన చూపిస్తాను.అమెరికా చరిత్రలోనే చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి’ అని హెచ్చరించారు.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas) యుద్ధం వల్ల పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా.. తమ చెరలో ఉన్న బందీలకు(Hamas Hostage)ల వీడియోను ఇటీవలే హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ (Hamas) మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఆ వీడియోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడ్డారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందగా.. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.