Bilkis Bano case: 'బిల్కిస్ బానో కేసు దోషులను ఎందుకు విడుదల చేశారు..?'

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.

Update: 2023-08-17 16:27 GMT

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మంది ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గుజరాత్ సర్కారు నియమించిన ఒక కమిటీ నివేదికను అనుసరించి 2022 ఆగస్టు 15న (అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు) 11 మంది దోషులను విడుదల చేయడంపై గతేడాది బిల్కిస్ బానో వేసిన పిటిషన్ ను జస్టిస్ బీ.వీ.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. "బిల్కిస్ బానో కేసు దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.

అటువంటి పరిస్థితుల్లో 14 సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఎలా విడుదల చేస్తారు..? జైళ్లు ఖైదీలతో నిండి ఉన్న తరుణమిది.. 11 మందిని మాత్రమే విడుదల చేసి, ఇతర ఖైదీలకు ఎందుకా అవకాశం ఇవ్వలేదు..? వీరిని మాత్రమే విడుదల చేయడానికి కారణాలేంటి..? ఖైదీల విడుదలకు సంబంధించిన రెమిషన్ పాలసీలో ఎందుకీ వివక్ష..? " అని ధర్మాసనం గుజరాత్ సర్కారును నిలదీసింది. బిల్కిస్ బానో కేసులో దోషులపై సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ కమిటీ వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను గోద్రా కోర్టు నిర్వహించనప్పుడు, దోషుల విడుదల విషయంలో ఆ కోర్టు అభిప్రాయాన్ని ఎందుకు తీసుకున్నారని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది. తదుపరి విచారణను ఆగస్టు 24కు వాయిదా వేసింది.


Similar News