చిత్తడవుతోన్న చైన్నై.. విమానాలు రద్దు.. విద్యాసంస్థలకు సెలవు

అతిభారీవర్షాలతో చెన్నైఅతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్ లపైకి నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-10-15 15:02 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా తీవ్రరూపం దాలుస్తోంది. అల్పపీడన ప్రతాపం ఇటు రాయలసీమ, అటు తమిళనాడు లోని జిల్లాలపై చూపిస్తోంది. భారీ వర్షాలతో చెన్నై, చుట్టుపక్కల జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. రోడ్లన్నీ జలయమమయ్యాయి. లోతట్టుప్రాంతాల్లోకి నీరు చేరడంతో.. ఇళ్లు నీట మునిగి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ రేపు కూడా విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వాయుగుండంగా మారే అల్పపీడనం నార్త్ తమిళనాడు, పుదుచ్చేరిల వైపు కదులుతూ.. అక్టోబర్ 17 నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు ల మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ (india meteorological department) పేర్కొంది.

మరోవైపు రన్ వేలు కూడా వర్షపు నీటితో మునగడంతో.. పలు విమాన సర్వీసులను ఎయిర్ పోర్టు అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఐటీ ఉద్యోగులకు కూడా ఈనెల 18వ తేదీ వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆయా కంపెనీలను కోరారు. తమిళనాడు వ్యాప్తంగా రానున్న మూడ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో సముద్రతీరప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు వెంటనే ఖాళీ చేయాలని సూచించింది. సముద్రతీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో ఆ ఏరియాల్లో నివాసితులను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించింది. అలాగే బోట్లను కూడా సేఫ్ ప్లేస్ లలో ఉంచుకోవాలని సూచించింది.

మెట్రోల్లో ప్రయాణించేవారు తమ వాహనాలను మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేయవద్దని చెన్నై మెట్రో రైల్ డిపార్ట్మెంట్ కోరింది. భారీ వర్షాల నేపథ్యంలో నీరు నిలిచిపోతుండటంతో.. కోయంబేడు, సెయింట్ థామస్ మౌంట్, అరుంబాక్కం మెట్రో స్టేషన్ల వద్ద అక్టోబర్ 17 వరకూ వాహనాలను పార్క్ చేయవద్దని కోరింది. కొన్నిప్రాంతాల్లో మెట్రో ట్రైన్ సేవల్ని నిలిపివేసింది. ఎవరికైనా అనుమానాలుంటే.. 1800 425 1515, మహిళలు 155370 నంబర్లను సంప్రదించాలని కోరింది. మోకాలిలోతు నీటిలో వాహనాలతో వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కుండపోత వర్షం, ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్స్ కు సిగ్నల్స్ కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుని సహాయం కావాల్సిన వారు 1070, 1077 నంబర్లను, 9445869848 నంబర్ కు వాట్సాప్ లో సమాచారం పంపాలని ప్రభుత్వం తెలిపింది. వరద సహాయం, ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లు, వాలంటీర్ల కోసం 1913 నంబర్ కు కాలా చేయాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. సీఎం స్టాలిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 



Similar News