Gujarath : గుజరాత్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. 427 కేజీల మాదక ద్రవ్యాలు సీజ్

అంక్లేశ్వర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో 427 కిలోల మాదక ద్రవ్యాలు, 141 గ్రాముల ఎండీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-21 09:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ పారిశ్రామిక ప్రాంతంలోని ‘అవాసర్ ఎంటర్‌ప్రైజ్’ అనే ఫ్యాక్టరీలో రూ.14.10 లక్షల విలువైన 427 కిలోల మాదక ద్రవ్యాలు, 141 గ్రాముల మెథాంఫెటమైన్ (ఎండీ) డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు జిల్లా ఎస్‌ఓజీ, సూరత్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి ఆనంద్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని సైతం అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపినట్టు చెప్పారు.

కాగా, అక్టోబరు 13న ఇదే ఫ్యాక్టరీకి సమీపంలోని అవ్కార్ అనే కర్మాగారంలో గుజరాత్, ఢిల్లీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో రూ. 5,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకులో 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో కంపెనీకి చెందిన ముగ్గురు ఆపరేటర్లు అశ్విన్ రమణి, బ్రిజేష్ కొథియా, విజయ్ భేసానియా, ఇద్దరు శాస్త్రవేత్తలను అరెస్టు చేశారు. అంతేగాక ఈనెల 10న ఢిల్లీలోని రమేష్ నగర్‌లోని ఓ దుకాణంలో అదనంగా 208 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటన జరిగిన పది రోజుల్లోపే మరోసారి అధిక మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.

కెమికల్స్ ముసుగులో డ్రగ్స్ తయారీ!

రసాయనాలు తయారు చేసే ఫ్యా్క్టరీలో డ్రగ్స్ పట్టుబడటంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కెమికల్ ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. అయితే కంపెనీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నప్పటికీ ఫ్యాక్టరీల యజమానులు మాత్రం విదేశాల్లో ఉండటం గమనార్హం. కాగా, ఇటీవల గుజరాత్, సూరత్ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. 


Similar News