India- China: కొలిక్కి వచ్చిన భారత్- చైనా వివాదం

భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న వివాదం కొలిక్కి వచ్చింది.

Update: 2024-10-21 11:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈ వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు అనేక దఫాలుగా జరిపిన చర్చల్లో పురోగతి లభించింది. బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్‌ తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌ 22-23న రష్యాలో జరగనున్న బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వెళ్లనుండగా ఈ పరిణామం జరిగింది. ‘‘భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌ పునఃప్రాంభంపై ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అనేక వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. బలగాల ఉపసంహరణ, 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు.

బ్రిక్స్ సదస్సు

అయితే, బ్రిక్స్‌ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయా లేదా అనే దానిపై అన్న ప్రశ్నకు విదేశాంగశాఖ జవాబిచ్చింది. భారత్‌-చైనా మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అలానే, ద్వైపాక్షిక చర్చలకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తున్నామంది. భారత్‌-చైనా సరిహద్దులోని గల్వాన్‌ (Galwan) లోయలో 2020లో చోటుచేసుకున్న ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాలు అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అయితే, ఎల్ఏసీ వెంట నెలకొన్న ప్రతిష్టంభనపై ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు చాలా సార్లుచర్చలు జరిపారు.


Similar News