1563 మంది గ్రేస్ మార్కులు తీసేస్తాం : కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో : ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024’ గ్రేస్ మార్కుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024’ గ్రేస్ మార్కుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1563 మంది విద్యార్థులకు అదనంగా ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వారందరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. 1563 మందికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి ఈ నెల 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది. వారికి ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని భావించేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులను కలిపారు. అయితే ఈవిధంగా కొందరికి మార్కులను కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. కొందరు నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈనేపథ్యంలో గతవారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో అధ్యయన కమిటీని వేసింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కమిటీ అధ్యయనంలో గుర్తించిన వివరాలు, చేసిన సిఫార్సుల సమాచారంతో కూడిన నివేదికను కేంద్ర సర్కారు గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే నీట్ ఎగ్జామ్‌లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర సర్కారు వెల్లడించింది.
ప్రశ్నపత్రం లీకేజీపై..
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. నీట్ వెబ్ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్లు డిమాండ్ చేయగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. కాగా, జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే..
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ పరీక్ష వ్యవహారంలో కొత్తగా తలెత్తిన సమస్యలకు బాధ్యులైన వారిని గుర్తించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని తాము న్యాయస్థానంలోనూ ఎదుర్కొంటున్నామని చెప్పారు. ‘‘ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అబద్ధాలు.. విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తాం’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
24 లక్షల మంది భవిత ప్రమాదంలో : ఖర్గే
ప్రధాని మోడీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు, మోసాలు జరిగాయన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. పరీక్ష కేంద్రం, కోచింగ్ సెంటర్ కుమ్మక్కై ‘డబ్బు ఇవ్వండి.. పేపర్ తీసుకోండి’ అనేలా అవగాహన కుదుర్చుకున్నారని ఖర్గే కామెంట్ చేశారు. ఈ బాధ్యతను ఎన్‌టీఏపైకి నెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి తప్పించు కోలేదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై జనాగ్రహం పార్లమెంటులోనూ ప్రతిధ్వనిస్తుందని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ అన్నారు.
ఎన్టీఏ తప్పును అంగీకరించింది: పిటిషనర్
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లలో ఫిజిక్స్ వాలా సీఈఓ అలఖ్ పాండే దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ‘‘కొందరు విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు తప్పు అని సుప్రీంకోర్టు ఎదుట ఎన్టీఏ అంగీకరించింది. ఇక నీట్ యూజీ పేపర్ లీక్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దానిపైనా మేం పోరాడుతాం’’ అని అలఖ్ పాండే పేర్కొన్నారు.