ముడి సోయా, పొద్దు తిరుగుడు నూనెల దిగుమతులపై సుంకం మినహాయింపు!
ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతులపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ మినహాయింపు కూడా ఉంటుందని తెలిపింది. షరతులతో కూడైన ఈ మినహాయింపు జూన్ 30 వరకు ఉంటుందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా(టీఆర్‌క్యూ) లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని, దాని ప్రకారం, కేంద్రం విధించిన పరిమితిని బట్టి నూనెలను దిగుమతి చేసుకునే తక్కువ సుంకం వర్తిస్తుంది.
నిర్దేశించిన పరిమితి దాటితే ఎక్కువ సుంకం వర్తిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ద్వారా దిగుమతిదారులకు టీఆర్‌క్యూ కేటాయించబడుతుంది. ముడి సోయా బీన్, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతి సుంకం మినహాయింపునకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం మే 11 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.