స్మార్ట్‌ ఫోన్‌కు అత్యవసర హెచ్చరిక.. అప్రమత్తం చేసేందుకే..

మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా ‘బీప్.. బీప్’ అని మోగిందా..?

Update: 2023-08-17 13:12 GMT

న్యూఢిల్లీ: మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా ‘బీప్.. బీప్’ అని మోగిందా..? మీరు ఓకే బటన్ నొక్కే వరకూ ఫోన్ మోగుతూనే ఉందా..? అయితే.. అది ప్రభుత్వం నుంచి వచ్చిన ‘అత్యవసర హెచ్చరిక’. చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు గురువారం తమ ఫోన్లలో ‘అత్యవసర హెచ్చరిక’ సందేశంతో పాటు బిగ్గరగా బీప్ అలర్ట్‌ను అందుకున్నారు. ఇదేమిటో తెలుసా.. ప్రభుత్వం అనేక స్మార్ట్‌ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్‌ను పంపడం ద్వారా దాని అత్యవసర హెచ్చరిక వ్యవస్థను పరీక్షించింది. దేశంలోని మొబైల్ వినియోగదారులు జూలై 20వ తేదీన కూడా ఇదే విధమైన పరీక్ష హెచ్చరికను అందుకున్నారు. అలారం వంటి బీప్ శబ్దంతో కూడిన హెచ్చరికను పంపించింది. ‘అత్యవసర హెచ్చరిక’ సందేశం చదివినట్లు ఓకే బటన్ నొక్కి నిర్ధారించే వరకూ బీప్ శబ్దం వస్తూనే ఉంది.

ప్రకృతి వైపరీత్యాల గురించి అప్రమత్తం చేసేందుకే..

భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలువురు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పంపించిన నమూనా పరీక్ష సందేశంలో ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ వైపు నుంచి ఎలాంటి చర్య అవసరం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అమలు చేస్తున్న ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌కు ఈ సందేశం పంపించాం. ఇది ప్రజా భద్రతను మెరుగు పరచడం, అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని ఉంది.

మొబైల్ ఆపరేటర్లు, సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యం, ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తారని టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీతో కలిసి ప్రభుత్వం పని చేస్తోంది.


Similar News