Gopal Rai: ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలి.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో కృత్రిమ వర్షం (Artificial rain) కురిపించాలని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal rai) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్రానికి ఓ లేఖ రాశారు. ‘ఉత్తర భారత దేశాన్ని పొగమంచు కప్పేసింది. దీని నుంచి విముక్తి పొందాలంటే కృత్రిమ వర్షమే ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితి మెడికల్ ఎమర్జెన్సీ(Medical emergency)ని తలపిస్తోంది. ఈ విషయంలో ప్రధాని మోడీ (Pm modi) జోక్యం చేసుకోవాలి. కాలుష్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. సమస్యను పరిష్కరించడం ఆయన నైతిక బాధ్యత’ అని పేర్కొన్నారు.
ఈ విషయంపై కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupendra Yadav)కు ఇప్పటికే నాలుగు లేఖలు పంపించినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృత్రిమ వర్షంపై డిస్కస్ చేసేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీలో బీఎస్-III పెట్రోల్, ఫోర్ వీలర్స్, బీఎస్-IV డీజిల్ వాహనాలను నిషేధించామన్నారు. బయటి నుండి వచ్చే అన్ని ట్రక్కులు, డీజిల్ బస్సులను సైతం బ్యాన్ చేసినట్టు తెలిపారు. పాఠశాలలను మూసివేశామని, వర్క్ ఫ్రం హోం అమలుపై దృష్టి సారించామని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.