GATE 2025:నేడు గేట్ ఫలితాలు విడుదల
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ఫలితాలు బుధవారం (మార్చి 19) విడుదల కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ఫలితాలు బుధవారం (మార్చి 19) విడుదల కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు IIT రూర్కీ తీసుకున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల స్కోర్‌ను ఇవాళ సాయంత్రం వెల్లడించనుంది. ఇక IIT రూర్కీ గేట్ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 27న విడుదల చేసి మార్చి 1న అభ్యంతర విండోను మూసివేసింది. ప్రతి సంవత్సరం లాగే.. సెక్షనల్ పేపర్‌లకు ప్రత్యేక ర్యాంకులు, స్కోర్‌లు ఉంటాయి. గేట్ 2025 స్కోర్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
ఎంటెక్‌లో, కొన్ని విద్యాసంస్థల్లో నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశానికి... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSU)లో కొలువులకు అర్హత పొందేందుకు ఈ పరీక్షలను IISC బెంగళూరు, పాత IITలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఇక అభ్యర్థులు స్కోర్ కార్డులను మార్చి 28 నుంచి మే 31 వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేశారు. సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరై ఉంటారని అంచనా. కాగా, గత ఏడాది 8.26 లక్షల మంది దరఖాస్తు చేసి.. 6.53 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 1.29 లక్షల మంది అర్హత సాధించారు. గేట్ పరీక్ష రాసిన అభ్యర్థులు gate2025.iitr.ac.in అధికారిక వెబ్ సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.