నీట్ పరీక్షను రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో పిటిషన్

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఫలితాలను రీకాల్ చేసి, ఆ ఎగ్జామ్‌‌ను మళ్లీ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2024-06-10 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఫలితాలను రీకాల్ చేసి, ఆ ఎగ్జామ్‌‌ను మళ్లీ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ ఫలితాల విడుదలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున ఆ దిశగా యోచించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థుల కోసం పనిచేస్తున్న అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, డాక్టర్ షేక్ రోషన్ మొహిద్దీన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నీట్ యూజీ పరీక్షలో 718, 719 మార్కులు చాలా ఎక్కువని.. వాటిని సాధించడం అసాధ్యమని వారు పేర్కొన్నారు. నీట్ పరీక్ష రాసిన వందలాది మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపులోనూ తేడాలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారు. ‘‘ విద్యార్థులకు గ్రేస్ మార్కులను కేటాయించడంలో అస్సలు లాజిక్ లేదు. గ్రేస్ మార్కులు కేటాయించిన వివరాలతో జాబితాను ఇంకా విడుదల చేయలేదు. పరీక్షకు ముందు విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో గ్రేస్ మార్కుల కేటాయింపు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు’’ అని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు. ‘‘ఓ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన దాదాపు 67 మందికీ 720 మార్కులు చొప్పున వచ్చాయి. ఇది చాలా అనుమానాస్పదం’’ అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కీ పేపర్ వర్సెస్ 13వేల మంది విద్యార్థులు

‘‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన తాత్కాలిక సమాధానాల కీలో ఉన్న సమాధానాలతో దాదాపు 13వేల మందికిపైగా విద్యార్థులు విభేదిస్తున్నారు. ఇలా విద్యార్థులను మోసం చేయడం సరికాదు’’ అని అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, డాక్టర్ షేక్ రోషన్ మొహిద్దీన్ పిటిషన్‌లో తెలిపారు. ‘‘నీట్ ప్రశ్నాపత్రం లీకైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పేపర్ లీకేజీలను నిలువరించాలి. వాటిని అడ్డుకోకుంటే.. డబ్బులు చెల్లించి వాటిని కొనే స్థోమత కలిగిన వారిదే పైచేయి అవుతుంది. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమైన చర్య. ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్లు మెడికల్ ప్రొఫెషన్‌లోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తే.. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇక మే 5న జరిగిన నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌‌పై ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ఇప్పటికే కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై మే 17న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, నీట్ పరీక్షకు హాజరైన దాదాపు 1,600 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కుల వ్యవహారంపై దర్యాప్తునకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇటీవల ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.


Similar News