మాజీ కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
కర్ణాటకలోని చామరాజనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని చామరాజనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుధీర్ఘ రాజకీయ జీవితం ఉన్న ఆయన ఈ ఏడాది మార్చి18న ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
కాగా, 1947 జూలై 1న జన్మించిన శ్రీనివాస ప్రసాద్ జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. వాజ్ పేయి మంత్రి వర్గంలో 1999 నుంచి 2004 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. 2016లో మళ్లీ బీజేపీలో చేరారు. 1980 నుంచి ఆరుసార్లు చామరాజనగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనే అదే స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
శ్రీనివాస్ ప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.‘చామరాజనగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఎంపీ ప్రసాద్ మరణం చాలా బాధ కలిగించింది. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రీనివాస్ చేసిన సమాజ సేవ ఎనలేనిది. అతని కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.