హస్తం గూటికి లక్ష్మణ్ సవాడీ
బీజేపీ నుంచి తప్పకున్న కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ కాంగ్రెస్‌లో చేరారు..
- ఆహ్మానించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్
- అథని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం!
- మరికొందరు బీజేపీ నేతలు చేరే ఛాన్స్
బెంగళూరు: బీజేపీ నుంచి తప్పకున్న కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం సిద్ధరామయ్య నివాసంలో డీకే శివకుమార్ లతో సమావేశమైన ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సవాడీ వంటి గొప్ప నేతలను పార్టీలో చేర్చుకోవడం తమ కర్తవ్యమని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో బుధవారం పార్టీని వీడుతున్నట్లు సవాడీ ప్రకటించారు. తనకు అవమానం జరిగిందనే భావనతోన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుమారు 9 నుంచి 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీలో ప్రస్తుతం ఖాళీ లేదు’ అని శివకుమార్ అన్నారు. కాగా, సవాడీ అథానీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2018 ఎన్నికల్లో సవాడీ కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే బీజేపీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ నుంచి వైదొలిగారు.