'పరిపాలనపై దృష్టి, సమయానికి పనిని పూర్తి చేయాలి ': కొత్త మంత్రులతో ప్రధాని మోడీ

కేబినెట్‌లోకి అడుగుపెడుతున్న కొత్త మంత్రులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

Update: 2024-06-09 09:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ ఆదివారం కొత్త మంత్రులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్‌లోకి అడుగుపెడుతున్న కొత్త మంత్రులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనపై దృష్టి పెట్టాలని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని వారికి సూచించారు. కేబినెట్ ఏర్పాటుకు ముందు ప్రధాని మోడీ ఇలాంటి సమావేశం నిర్వహించడం 2014 నుంచి జరుగుతోంది. ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కొత్త మంత్రులకు ఉండబోయే బాధ్యతలు, నెరవేర్చాల్సిన అంచనాల కోసం వారిని మోడీ సన్నద్ధం చేస్తారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, సర్బానంద సోనోవాల్, పీయూష్ గోయల్, ఎస్ జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు నేతకు ఆదివారం ఉదయానే ప్రధాని మోడీ ఇంటి వద్దకు చేరుకున్నారు. కొత్త కేబినెట్‌లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్ వంటి కీలక మంత్రులు తమ శాఖలను కొనసాగించనున్నారు. మిత్రపక్షాలైన టీడీపీకి చెందిన రామ్‌మోహన్ నాయుడు, చంద్రసేఖర్ పెమ్మసారి, జేడీయూ నుంచి లలన్ సింగ్‌లకు కూడా మంత్రి పదవులు దక్కనున్నాయి. 


Similar News