Census: 2028కల్లా డీలిమిటేషన్ పూర్తి! ఇన్నాళ్లు ఎందుకు వాయిదా పడింది?

ప్రతి పదేళ్లకు నిర్వహించే జనగణన తర్వాత డీలిమిటేషన్ కూడా చేపట్టాలని రాజ్యాంగం చెబుతుంది. కానీ, 1970ల తర్వాత లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనే లేదు.

Update: 2024-10-28 17:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జన గణన(Census) ప్రక్రియను వచ్చే ఏడాది మొదలు పెట్టనున్నట్టు సమాచారం. చివరిసారి 2011లో నిర్వహించిన ఈ ప్రక్రియను 2021లో(ప్రతి పదేళ్లకు ఒకసారి) చేపట్టాల్సింది. కానీ, కరోనా మహమ్మారితో ఈ ప్రక్రియ వాయిదా పడింది. నాలుగేళ్లు ఆలస్యంగా 2025లో జనాభా గణించే ప్రక్రియ మొదలుపెట్టి 2026లో ముగించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డీలిమిటేషన్‌(Delimitation)కు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ 2028లో ముగుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాలు కుల గణన(Caste Census) కోసం పట్టుబడుతున్న వేళ జనగణన గురించి ఈ సమాచారం బయటికి రావడం గమనార్హం. అలాగే.. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఇక్కడి పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కేంద్రం సిద్ధమవతున్నట్టు తెలుస్తున్నది.

పార్లమెంటు ఆమోదంతోనే..

ఒక పౌరుడికి, ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రం, సమాన ప్రాతినిధ్యం కోసం పదేళ్లకోసారి జనాభా గణన తర్వాత లోక్‌సభ(Lok Sabha), శాసన సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలని రాజ్యాంగం చెబుతుంది. ఆర్టికల్ 82(లోక్ సభ), ఆర్టికల్ 170(అసెంబ్లీ) నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను తప్పనిసరి చేస్తాయి. ఇక ఆర్టికల్ 330, 332లు కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్‌ నియోజకవర్గాలకు అవకాశమిస్తాయి. ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు తొలి అడుగు పార్లమెంటులో పడుతుంది. డీలిమిటేషన్ యాక్ట్‌ను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ డీలిమిటేషన్ యాక్ట్ ఆధారంగానే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది. నిర్ణీత కాల అవధిలో నియోజకవర్గాల పునర్విభజనను ఈ కమిషన్ చేపడుతుంది. ఈ కమిషన్ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయలేం.

ఎందుకు వాయిదా పడింది?

మన దేశంలో నాలుగు సార్లు 1952, 1962, 1972, 2002లో కమిషన్లు ఏర్పడాయి. కానీ, చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన 1972లో జరిగింది. డీలిమిటేషన్ కమిషన్, 1972 లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యను 542కు పెంచింది(సిక్కిం నుంచి ఒక సీటు కలుపడంతో నేటి 543కు సంఖ్య పెరిగింది). 1970ల నుంచి లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 543గానే ఉన్నది. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదాపడుతూ వస్తున్నది. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో 2001 జనగణన వరకు వాయిదా పడింది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలతో ఈ వాయిదా 2006 వరకు పొడిగించారు.

దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు ఎందుకు?

జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య నిర్ణయిస్తారు. జనాభా ఎక్కువగల రాష్ట్రాలకు ఎక్కువ లోక్ సభ స్థానాలు వస్తే.. తక్కువ జనాభాగల రాష్ట్రాల్లో ఈ సంఖ్య తగ్గుతుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తెచ్చిన జనాభా నియంత్రణను ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా చేపట్టాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణలో ఉంటే ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో విపరీతంగా పెరిగింది. నిబంధనలను తుంగలో తొక్కిన ఈ రాష్ట్రాలకు డీలిమిటేషన్ కలిసిరానుంది. ఈ రాష్ట్రాలకు లోక్ సభ స్థానాల సంఖ్య పెరగనున్నాయి. దీనిపైనే దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలున్నాయి. ఈ అభ్యంతరాల వల్లే డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు కూడా దక్షిణాది నుంచి అభ్యంతరాలు వినిపిస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News