PM Modi: అవకాశాల కోసం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది: పీఎం మోడీ
వివిధ రంగాల్లో భారత్ అందించే విస్తృత అవకాశాల గురించి చర్చిస్తున్నారని మోడీ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం ఇప్పుడు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తోందని, ప్రతి ఒక్కరూ ఓ కొత్త ఆశతో దేశంవైపు చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ చేసే వ్యాఖ్యలను ప్రపంచమంతా శ్రద్ధగా వింటోంది. వివిధ రంగాల్లో భారత్ అందించే విస్తృత అవకాశాల గురించి చర్చిస్తున్నారని సోమవారం గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ తెలిపారు. రాష్ట్రంలో రూ. 4,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు, భాగస్వామ్యం కోసం ఎక్కువ ఆసక్తి చూపించాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్.. గతవారం న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా తమ దేశం ప్రతి ఏటా 90,000 మంది భారతీయులకు వీసాలు మంజూరు చేస్తుందని చెప్పారని, ఇప్పుడు దానికోసం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత దేశ యువతపై ఉందని మోడీ సూచించారు. మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం ముందు భారత్ గౌరవంతో పాటు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం భారత్‌ను కొత్త ఆశతో, కొత్త కోణంలో చూస్తోంది. భారత్ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభించారన్నారు.