ఆ రాష్ట్రంలో ఫస్ట్‌టైమ్ పాసింజర్ రైలొచ్చింది! ఎంత స్పెషలంటే..
74 ఏళ్ల స్వతంత్ర భారతంలో మొదటిసారి ప్యాసింజర్ రైలు. First Passenger Train at Khongshang Railway Station in Manipur
దిశ, వెబ్‌డెస్క్ః 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆ రాష్ట్రానికి మొట్టమొదటిసారి ఓ ప్యాసింజర్ రైలు రావడం ఎంతో విశేషమనే చెప్పుకోవాలి. ట్రయల్ రన్‌లో భాగంగా మణిపూర్‌లోని నోనీ జిల్లాలో కొత్తగా నిర్మించిన ఖోంగ్‌షాంగ్ రైల్వే స్టేషన్‌కు ఈ కొత్త రైలింజన్ సోమవారం వచ్చింది. కొండల మధ్య ఉండే ఖోంగ్‌షాంగ్ పట్టణానికి రెండు నెలల ముందు, అంటే, జనవరిలో మొదటి సారి ఓ గూడ్స్ రైలు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాసింజర్ రైలు వస్తుందని తెలిసి, అక్కడి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ ఇంజనీర్ సందీప్ శర్మ నేతృత్వంలో ఈ రైలు జిరిబామ్ నుండి రాణి గైడిన్లియు (కైమై), థింగౌ రైల్వే స్టేషన్‌ల మీదుగా ఖోంగ్‌షాంగ్ దాదాపు 62 కి.మీ. ప్రయాణించి ఇక్కడకు చేరుకుంది.
ఇక, తింగౌ, ఖోంగ్‌షాంగ్‌లలో ఇంజిన్‌కు స్వాగతం పలికేందుకు మహిళలు రోంగ్మై తెగ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఈ నృత్యం వీడియోను మణిపూర్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్‌లో పంచుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో మంచి చేస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Another milestone achieved, today engine reaches Khongsang station in Manipur. #NERailConnectivity #Infra4India pic.twitter.com/ntwurqEe62
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 14, 2022
దాదాపు ₹14,322 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 111 కి.మీ ఇంఫాల్-జిరిబామ్ రైల్వే లైన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. ఇది మణిపూర్‌లో 11 స్టేషన్‌లతో ఐదు జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇంఫాల్‌ను దేశంలోని బోర్డ్ గేజ్ నెట్‌వర్క్‌తో కలుపుతుంది. కొండ ప్రాంతాలున్న ఈ మార్గంలో దాదాపు 63 కి.మీ సొరంగాల నిర్మాణం ఉండగా అందులో ఒక సొరంగం ఏకంగా 10.28 కి.మీ. పొడవు ఉంది. ఇదే, ప్రాజెక్ట్‌లో భాగంగా నోనీలోని ఖుమ్జీ సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన పైర్ కూడా నిర్మిస్తున్నారు. ఇది, మోంటెనెగ్రోలోని 139 మీటర్ల మాలా-రిజెకా వయాడక్ట్‌ను అధిగమిస్తూ 141 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న వంతెనా రికార్డు సృష్టించనుంది.