CM Yogi: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పదేపదే అవమానించిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అంబేడ్కర్(Ambedhkar)ను కాంగ్రెస్ పదేపదే అవమానించిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath) విమర్శించారు. ఇందుకు గాను వారు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబా సాహెబ్ కలలు కన్న దేశాన్ని నిర్మించడానికి బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. లక్నోలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ జీవించి ఉన్న సమయంలో కాంగ్రెస్(Congress) పదేపదే అగౌరవపరిచిందని, మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని ఆరోపించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేడ్కర్‌ను చేర్చడాన్ని భారత తొలి ప్రధాని నెహ్రూ(Nehru) వ్యతిరేకించారన్నారు. దేశ ఆవిర్భావ సమయంలో బాబా సాహెబ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అనేక సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక శాస్త్రంలో అత్యున్నత డిగ్రీలు పొందాడని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోనే అంబేడ్కర్ ఆశయాలను గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయన్నారు. కానీ దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అవమానించిందని మండిపడ్డారు. దేశంలో దళితులు, అణగారిన వర్గాలను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు.