GRAP-4: ఢిల్లీలో జీఆర్ఏపీ-4 ఆంక్షలు ఎత్తివేత.. ఏక్యూఐ మెరుగుపడటంతో నిర్ణయం
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 ఆంక్షలను ఎత్తి వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 (GRAP-4) ఆంక్షలను అధికారులు ఎత్తి వేశారు. గాలి నాణ్యత కాస్త మెరుగుపడటంతో దీనిని నిబంధనలు రద్దు చేసినట్టు కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తెలిపింది. అయితే కాలుష్య స్థాయిలను మరింత నియంత్రించడానికి జీఆర్ఏపీ-3 పరిమితులు మాత్రం అమల్లులో ఉంటాయని పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 364గా ఉంది. ఇది స్టేజ్-4ను అమలు చేయడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిన పరిమితుల కంటే 36 పాయింట్లు తక్కువ. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఎత్తేశారు. కాగా, ఏక్యూఐ దారుణంగా పడిపోయిన తర్వాత ఈ నెల 16 నుంచి ఢిల్లీలో జీఆర్ఏపీ-4 ను అమలు చేశారు. మరోవైపు దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఆనంద్ విహార్ 439, అశోక్ విహార్‌లో 456, బవానాలో 473, సీఆర్‌ఆర్‌ఐ మధుర రోడ్‌లో 406 ఏక్యూఐ నమోదైంది.