పాట్నాలో అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి: రైల్వే స్టేషన్ సమీపంలోనే ఘటన
బిహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..20 మందికి పైగా గాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..20 మందికి పైగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. దీంతో వెంట వెంటనే మూడు హోటళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హోటల్ భవనంలో చిక్కుకున్న మరో 45 మందిని రక్షించారు. మంటలు అదుపులోకి వచ్చాక హోటల్ లోపలకు వెళ్లి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు అగ్నిమాపక శాఖ డీఐసీ మృత్యుంజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే పాట్నాలోని రైల్వే స్టేషన్ సమీపంలోనే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పాట్నా స్టేషన్‌కు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు.