యుద్ధం జరిగితే నష్టపోయేది కశ్మీరీలే : Farooq Abdullah
కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింసపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు...
శ్రీనగర్: కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింసపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా ఉన్నాయని ఒకవేళ యుద్ధం జరిగితే తీవ్రంగా నష్టపోయేది కశ్మీర్ ప్రజలేనని పేర్కొన్నారు. ‘మనం స్నేహితులను మార్చగలమేమో గానీ.. ఇరుగుపొరుగున ఉన్న దేశాలను మార్చలేం’ అని గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యను ఆయన గుర్తుచేశారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలే క్షేమకరమన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారానికి రావడం ఉత్తమమని సూచించారు. ఒకవేళ అలా జరగకుంటే.. కశ్మీర్ పరిస్థితి ‘గాజా’లా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.