న్యూఢిల్లీ : జర్నలిస్టు రానా అయ్యూబ్ అవినీతి వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బట్టబయలు చేశారు. కొవిడ్ కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు 'కెట్టో' పేరిట ఆమె ఫండ్స్‌ను రైజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.2.69 కోట్లు ఉంటుందని ఈడీ తేల్చింది. ఈ నేపథ్యంలోనే రానా అయ్యూబ్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం రంగంలోకి దిగిన ఈడీ అధికారులు విచారణలో భాగంగా రానా అయ్యూబ్ విరాళాల పేరిట సేకరించిన నిధులను పేదల కోసం కాకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని, వాటికి నకిలీ బిల్లులను సృష్టించారని గుర్తించారు. అంతకుముందు ఆమె వద్ద గల రూ.1.77 కోట్లు నిధులను ఈడీ అటాచ్ చేసింది. అనంతరం రానా అయ్యూబ్ తన వద్దగల రూ.74.50 లక్షలను మహారాష్ట్ర సీఎం కేర్స్, పీఎం కేర్స్‌కు బదిలీ చేసినట్టు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
అయితే, గతంలో పీఎం కేర్స్‌ను బహిరంగంగా విమర్శించింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. అయ్యూబ్ వివిధ ప్రచారాల ద్వారా చారిటీ పేరుతో భారీగా నిధులు సేకరించిందని, అందులో రూ.17,66,970 నిధులను మాత్రమే ప్రజాసేవ కోసం వినియోగించిందని ఈడీ ధృవీకరించినట్టు పేర్కొంది. ఈడీ అటాచ్ చేసిన ధనాన్ని అయ్యూబ్, ఆమె తండ్రి, చెల్లెలి బ్యాంకు ఖాతాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
రూ.72,01,786 నిధులు అయ్యూబ్ తన సొంత ఖాతాలో గుర్తించగా.. రూ.37,15,0722 నిధులను ఆమె చెల్లెలు ఈఫత్ షేక్ ఖాతా నుంచి, రూ.1,60,27,822 నిధులను తండ్రి మహమ్మద్ అయ్యూబ్ వకీఫ్ ఖాతా నుంచి డ్రా చేసి తిరిగి కొద్దికొద్దిగా తన అకౌంట్‌కు అయ్యూబ్ బదిలీ చేసినట్టు ఈడీ విచారణలో తేల్చింది.
ఈడీకి అయ్యూబ్ సమర్పించిన ఖర్చులకు సంబంధించిన పత్రాల్లో రూ.31.17లక్షల నిధుల్లో రూ.14 లక్షల నకిలీ బిల్లులను అధికారులు గుర్తించారు. ప్రజాసేవ కోసం వసూలు చేసిన చారిటీ డబ్బులను ఆమె వ్యక్తిగత, విమాన ప్రయాణాల కోసం వినియోగించినట్టు నిర్దారించారు. రానా అయ్యూబ్ మనీ లాండరింగ్ విషయంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. ఆమె మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా 'గుజరాత్ రియాట్స్' (గుజరాత్ అల్లర్లు) పేరిట రాసిన పుస్తకంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రముఖ జర్నలిస్టు, రైటర్ రానా అయ్యూబ్.